రేపు మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం|

0
1

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (ఆగస్టు 1) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీలో సుమారు రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం ప్రధాని షెడ్యూల్ లో కీలకంగా నిలవనుంది. మోదీ పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) విడుదల చేసింది. ఈ పర్యటన ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక ప్రగతికి గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు.

 

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం

ఈ పర్యటనలో అత్యంత ముఖ్యమైన ఘట్టం భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవం. సుమారు రూ.5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయానికి ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు. ఈ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి విమాన ప్రయాణ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.

 

సెమీకండక్టర్, విద్యుత్ ప్రాజెక్టులు

రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగుగా, విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్‌లోని తొలి సెమీకండక్టర్ తయారీ యూనిట్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రూ.460 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్లాంట్ ద్వారా ఏటా 96 మిలియన్ల చిప్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.