ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతోందని, కృత్రిమ మేధస్సు (ఏఐ), క్వాంటం ఇంజనీరింగ్ వంటి నూతన సాంకేతికతలు సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ భవిష్యత్ అవకాశాలను యువత అందిపుచ్చుకునేలా సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకాగా, మంత్రి లోకేశ్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, “యువత కేవలం ఉద్యోగార్థులుగా మిగిలిపోకూడదు, ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలన్నదే మా లక్ష్యం. వారు పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, నాయకులుగా ఎదగాలి. ఇందుకోసం విశ్వవిద్యాలయాలను, పరిశ్రమలను మరింత దగ్గర చేస్తున్నాం. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, యువత నేర్చుకోవడానికి, నూతన ఆవిష్కరణలు చేయడానికి, నాయకత్వం వహించడానికి అవకాశాలు కల్పిస్తున్నాం” అని వివరించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత ఉత్సాహభరితమైన కాలంలో విద్యార్థులు తమ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఒక గొప్ప ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు.










