ఆంధ్రప్రదేశ్లో గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మర్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడవచ్చని పేర్కొంది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ల కింద నిలబడవద్దని హెచ్చరించింది.










