కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మాదిగలు ఓట్లు వేయకుండానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా అంటూ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, మాజీ ఏఎంసీ చైర్మన్ గాధవేని మల్లేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మల్లేష్ కు సంబంధించిన ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ వైరల్ కావడంతో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నాయకులు ఉధృత నిరసన చేపట్టారు. వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చి అంబేద్కర్ చౌక్ నుండి వివేకానంద చౌక్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు, అనంతరం మల్లేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మాదిగలను కించపరిచేలా మాట్లాడిన సదరు నేతను తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని, అలాగే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సీఐకి ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు తమ సామాజికవర్గానికి పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసిన నేతలు, మల్లేష్ పై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరించారు.










