వర్షంలోనూ గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్

0
1

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు అత్యంత ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ గారు క్షేత్రస్థాయిలో పర్యటించి నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కాగజ్‌నగర్ పెద్దవాగు మరియు ఆసిఫాబాద్ పెద్దవాగు నిమజ్జన పాయింట్ల వద్ద పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను ఆమె నిశితంగా సమీక్షించారు.నిమజ్జన పాయింట్ల వద్ద పోలీస్ బందోబస్తును సమీక్షించిన ఎస్పీ గారు, నిమజ్జన వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పర్యవేక్షించారు. ముఖ్యంగా వర్షాల నేపథ్యంలో జారుడు ప్రాంతాలు, నీటి ప్రవాహం తీవ్రత, విద్యుత్ తీగలు మరియు ఇతర ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నిమజ్జన పాయింట్ల వద్ద అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం పోలీస్ సిబ్బంది ఇతర శాఖల అధికారులతో పూర్తి సమన్వయం కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు నిమజ్జన రూట్లలో వాహనాల క్రమబద్ధీకరణ, భక్తుల రద్దీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో విధులు నిర్వహించాలని ఎస్పీ గారు స్పష్టం చేశారు. జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా సాగుతోందని, ప్రజల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని భరోసా ఇచ్చారు. భక్తులు, వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.