NSUIలో కుల వివక్ష వివాదం.|

0
7

• ఏఐసీసీ అధిష్టానానికి యాదపల్లి వెంకటస్వామి లేఖ

• బల్మూరి వెంకట్‌పై సంచలన ఆరోపణలు

• NSUIలో వివక్షపై బహిరంగ లేఖ

• కమిటీల ఏర్పాటుపై వివాదం

అల్వాల్, సెప్టెంబరు 24: తెలంగాణ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. తనపై కుల వివక్ష జరుగుతోందంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదపల్లి వెంకటస్వామి ఏఐసీసీ అధిష్టానానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

మాజీ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను ఉద్దేశించి ఆయన రాసిన బహిరంగ లేఖలో పలు తీవ్ర ఆరోపణలు చేశారు.

రాజీవ్‌గాంధీ, రాహుల్‌గాంధీ ఆశయాల స్ఫూర్తితో 14 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్ష పదవి దక్కిందని వెంకటస్వామి పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్రలో తొలిసారిగా దళిత విద్యార్థికి ఈ అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు.

పదవి చేపట్టిన తొలిరోజు నుంచే తనపై వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు. ఎన్‌ఎస్‌యూఐపై తన పెత్తనం కొనసాగించాలనే ఉద్దేశంతో బల్మూరి వెంకట్‌ కొందరు విద్యార్థి నాయకులను ప్రోత్సహించి గాంధీభవన్‌లో తనను పదవి నుంచి తొలగించాలంటూ నిరసనలు చేయించారని ఆరోపించారు.

కొందరు దళిత విద్యార్థులను సైతం తనకు వ్యతిరేకంగా నిలబెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

మీడియా, సోషల్‌ మీడియా వేదికల ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేయిస్తూ ఆర్థికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని వెంకటస్వామి ఆరోపించారు. ఒక దళితుడు రాజకీయ, విద్యా, వ్యాపార రంగాల్లో అగ్రవర్ణాలతో సమానంగా ఎదగడాన్ని సహించలేని పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.

రోహిత్‌ వేముల, పాయల్‌ తాడ్వి ఎదుర్కొన్న వివక్షను తాను కూడా ఎదుర్కొంటున్నానని వెంకటస్వామి పేర్కొన్నారు.

రాష్ట్ర, జిల్లా ఎన్‌ఎస్‌యూఐ కమిటీల ఏర్పాటు జరగకుండా అడ్డుకుంటున్నారని, తన పదవీకాలం పూర్తికాకముందే రాష్ట్ర కమిటీని రద్దు చేయించేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై అధిష్టానం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, సామాజిక వర్గాలకు దక్కిన అవకాశాలను అడ్డుకునే ప్రయత్నాలను సహించబోనని వెంకటస్వామి తన లేఖలో స్పష్టం చేశారు.

 “మన హక్కులు ఎవరూ ఇవ్వరు.. మనం పోరాడి సాధించుకోవాలి” అనే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితో తన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

#Sidhumaroju

Alwal