ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ.. మాజీ అధ్యక్షుడు కె. విశ్వప్రసాద్రావుపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ ఎన్నికల్లో సొంత ఖర్చులతో పార్టీ గెలుపు కోసం విశ్వప్రసాద్రావు ఎంతో కృషి చేశారని, స్వతంత్రులను కాంగ్రెస్ వైపు తీసుకొచ్చారని గుర్తుచేశారు. మైనార్టీ నాయకుడికి చైర్మన్ పదవి దక్కకుండా ఆయన అడ్డుకున్నారనడం అబద్ధమన్నారు. చైర్మన్ పదవి కోసం రూ.1.50 కోట్లు ఖర్చు చేశారన్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని, డబ్బు ఎవరు ఎవరికి ఇచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పార్టీకి ఎవరు వెన్నుపోటు పొడిచారో తేలాలంటే.. ఆత్రం సుగుణ, విశ్వప్రసాద్రావు, ఆత్రం సక్కు తదితర ముఖ్య నేతల ఫోన్ కాల్ డేటాను విచారించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.










