అన్నమయ్య జిల్లా రాయచోటిలో ‘అమరావతి ఛాంపియన్‌షిప్–2026’ జిల్లా స్థాయి క్రీడా పోటీలను టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి, వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే ఈ ఛాంపియన్‌షిప్ ముఖ్య ఉద్దేశమన్నారు. యువత గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లాలో క్రీడా మౌలిక వసతులు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. క్రీడాకారులకు భోజనం, తాగునీరు, వైద్యం వంటి అన్ని వసతులను సమకూర్చిన డీఎస్‌డీఓ చంద్రశేఖర్, పీడీలు వీరాంజనేయులు, నర్సరాజులతో పాటు క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అన్నమయ్య జిల్లా నుంచి భవిష్యత్తులో ఎంతోమంది అద్భుతమైన క్రీడాకారులు వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు.










