ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక సందేశాన్ని విడుదల చేశారు. అవయవాలను దానం చేయాలనే ఒక చిన్న నిర్ణయం మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తుందని, ఇది అత్యంత శక్తివంతమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.
అవయవదానం ప్రాముఖ్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, తద్వారా మరింత మంది పౌరులు అవయవదాతలుగా మారేలా స్ఫూర్తిని నింపాలని పవన్ కల్యాణ్ కోరారు. “ఒక వ్యక్తి తన జీవిత కాలాన్ని పొడిగించుకోలేని స్థితిలో, మరొకరికి ప్రాణదానం చేయడం ద్వారా తన జీవితానికి ఒక సార్థకతను చేకూర్చుకోవచ్చు” అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రతి దానం ఒక నిరీక్షణకు భరోసా అని, ప్రతి దాత తమ మరణానంతరం ఒక గొప్ప వారసత్వాన్ని విడిచి వెళ్తారని పవన్ పేర్కొన్నారు. సమాజంలో అవయవదానం పట్ల ఉదారతను పెంపొందించే సంస్కృతిని అందరం కలిసి నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు. “ప్రాణదానం చేయండి.. ఆశను నింపండి, జీవితాలను కాపాడండి” అంటూ తన సందేశంలో పేర్కొన్నారు.










