కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 17, 18 తేదీల్లో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సంస్కృతి, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అధికారిక కార్యక్రమాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు.
17వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉట్నూర్ చేరుకోనున్న మంత్రి, అక్కడ గాదం నాచిరెడ్డి గార్డెన్స్‌లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం కాగజ్‌నగర్ చేరుకుని ఎస్‌పీఎం గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.
18వ తేదీ ఉదయం కాగజ్‌నగర్‌లోని రన్ గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్‌లో జరిగే సిర్పూర్(టి) నియోజకవర్గ అవగాహన సమావేశానికి మంత్రి హాజరవుతారు. అనంతరం వాంకిడి మండలంలో రూ.8.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
తదుపరి ఆసిఫాబాద్ ఐడీఓసీలో జరిగే కార్యక్రమంలో ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద లబ్ధిదారులకు కుట్టుమిషన్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేస్తారు. ఈ పర్యటనలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.










