బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు అలర్ట్.

0
1

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది.

దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రానున్న నాలుగైదు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి హెచ్చరికలు జారీ చేసింది.

 తీవ్ర అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లినవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగి రావాలని అధికారులు సూచించారు.