రోలుగుంట జూనియర్ కళాశాల వీధి విద్యుత్ కష్టాలపై కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన యువకుడు

0
2

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో పేదల సేవలో 2.0 కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ ను రోలుగుంట గ్రామ ప్రభుత్వ జూనియర్ కళాశాల వీధిలో నెలకొన్న విద్యుత్ సమస్యపై స్థానిక యువకుడు రంగాల అనంతలక్ష్మి భాస్కర్ కలిసి వినతిపత్రం అందజేశాడు.రోలుగుంట గ్రామం జూనియర్ కళాశాల వీధిలో గత నాలుగేళ్లుగా విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లేకుండా పోయిందని, స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన కలెక్టర్ కు తెలియజేశాడు. ఈ సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, పిజిఆర్ఎస్ ద్వారా వినతులు పెట్టుకున్నా తాత్కాలిక పరిష్కారం తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు వచ్చి చూసి ఏదో ఒక మరమ్మత్తు చేసి వెళ్లిపోతున్నారని, మరుసటి రోజు నుంచి మళ్లీ అదే పరిస్థితి నెలకొంటోందని వాపోయాడు.గ్రామం మొత్తంలో ఎక్కడ విద్యుత్ ఉన్నా తమ కాలనీలో మాత్రం ఎప్పుడూ విద్యుత్ కొరత ఉంటుందని, దీంతో తమ వీధి ప్రజలు నిత్యం చీకట్లో మగ్గిపోవాల్సి వస్తోందని ప్రశ్నించాడు. ప్రజలు ఈ విధంగా చీకట్లో మగ్గిపోవాల్సిందేనా అని నిలదీశాడు.ఈ నేపథ్యంలోనే పేదల సేవలో 2.0 కార్యక్రమంలో కలెక్టర్ ను నేరుగా కలిసి తమ సమస్యను వివరించాడు. ఇప్పటికైనా తమ సమస్యకు పరిష్కార మార్గం చూపి తమ కాలనీకి నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేలా విద్యుత్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశాడు.గతంలో ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కూడా పత్రికా ముఖంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఎన్నో ఏళ్లుగా తమ వీధి ఎదుర్కొంటున్న చీకటి కష్టాలకు ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశతో ఎదురుచూస్తున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు