🎤కుమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్:19 ఆగష్టు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మానుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఘాటుగా విమర్శించారు. బుధవారం జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావులతో కలిసి డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, ఎమ్మెల్యే కోవ లక్ష్మి వ్యక్తిగత విమర్శలు మాని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు గారు క్షేత్రస్థాయి వాస్తవాలను మాట్లాడారని ఆమె పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి వెళ్ళిందని మండిపడ్డారు. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అప్పులను తీర్చుకుంటూనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని మంత్రి ప్రశ్నించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సుగుణక్క హెచ్చరించారు.










