బీజేపీలో అంతర్గత విభేదాలు రఘునాథ్‌పై సీనియర్ నాయకుల తీవ్ర ఆరోపణలు

0
2

మంచిర్యాల జిల్లా : మంచిర్యాల కేంద్రంలో భారతీయ జనతా పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేష్ గౌడ్‌లపై సీనియర్ నాయకులు బొలిశెట్టి తిరుపతి, మేడిపల్లి సత్యం తీవ్ర ఆరోపణలు చేశారు. మంచిర్యాల జిల్లా పార్టీలో రఘునాథ్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనకు తొత్తుగా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ పనిచేస్తున్నారని విమర్శించారు. బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాలను నిర్వీర్యం చేస్తూ, మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ నాయకులను అణచివేస్తూ, రఘునాథ్‌కు తొత్తులుగా వ్యవహరించిన వారికి పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు.

ప్రస్తుతం రఘునాథ్‌తో ఉన్నవారంతా పేకాట క్లబ్బులు నడిపేవారని, పేకాట కేసుల్లో ఇరుక్కున్నారని, మహిళలతో గొడవలు పడినవారు, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినవారు, ఆర్థిక నేరస్తులు, ఇతర పార్టీల కార్యకర్తలు, ఒక ప్రముఖ బీజేపీ నాయకుడి సతీమణి హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, చెరువులను విధ్వంసం చేసినవారు, పూటకో పార్టీ మార్చేవారు, తాగుబోతులు, పార్టీ సిద్ధాంతాలు తెలియనివారని ఆరోపించారు.

వీరందరితో ఒక దండును ఏర్పాటు చేసుకొని, వీరికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు ఇప్పించడమే కాకుండా, తన సామాజిక వర్గానికి చెందిన సొంత పార్టీగా బీజేపీని మార్చి, పార్టీని సర్వనాశనం చేసే దిశగా రఘునాథ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఎన్‌హెచ్‌-63 రహదారిని తన ఆస్తిగా మార్చుకొని, దాదాపు 10 కోట్ల రూపాయలు అందుబాటులో పెట్టుబడిదారుల వద్ద నుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి, మైనారిటీ సంస్థల నుంచి వసూలు చేసి, అమాయకులైన రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ, రోడ్డు అలైన్‌మెంట్ మార్పుకు కారణమయ్యారని ఆరోపించారు