డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.85.20 లక్షల మోసం.|

0
2

● నకిలీ NIA అధికారి బెదిరింపులకు భయపడ్డ 85 ఏళ్ల వృద్ధుడు

● సకాలంలో స్పందించిన TGCSB.. మొత్తం నగదు ఫ్రీజ్

● సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శిఖా గోయల్ సూచన

ఆల్వాల్, ఆగస్టు 27: డిజిటల్ అరెస్ట్ పేరుతో నేరేడ్‌మెట్‌కు చెందిన 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసగించిన ఘటనలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సకాలంలో స్పందించి రూ.85.20 లక్షలను కాపాడింది.

ఈ నెల 21న బాధితుడికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి తాను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారినని పరిచయం చేసుకున్నాడు. బాధితుడి ఆధార్ వివరాలతో కర్ణాటక, కేరళలో సుమారు రూ.2.50 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు నమ్మించాడు.

వీడియో కాల్‌లో పోలీసు తరహా యూనిఫామ్‌లో కనిపించిన నిందితుడు అరెస్టు చేస్తామని బెదిరించడంతో వృద్ధుడు భయాందోళనకు గురయ్యాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించిన అనంతరం, ఆర్‌బీఐ వెరిఫికేషన్ పేరుతో ఓ బ్యాంకు ఖాతాకు రూ.85.20 లక్షలు బదిలీ చేయించాడు. పరిశీలన పూర్తయిన తర్వాత మొత్తం తిరిగి వస్తుందని నమ్మబలికాడు.

అయితే, కొంతసేపటికే మరో రూ.42 లక్షలు పంపాలని కోరడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. వెంటనే బ్యాంకును సంప్రదించి సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన ఆయన జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న TGCSB అధికారులు నగదు బదిలీ అయిన మార్గాన్ని గుర్తించి, నిందితులు ఉపయోగించిన కోయంబత్తూరులోని IDFC బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. దీంతో బాధితుడు బదిలీ చేసిన రూ.85.20 లక్షల మొత్తాన్ని పూర్తిగా కాపాడగలిగారు.

తదుపరి దర్యాప్తు, చట్టపరమైన చర్యల కోసం కేసును మల్కాజ్‌గిరి సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు.

TGCSB డైరెక్టర్ శిఖా గోయల్, ఐపీఎస్ ప్రజలను అప్రమత్తం చేస్తూ, పోలీసులు, NIA, CBI, RBI లేదా ఇతర ప్రభుత్వ సంస్థల అధికారులు వెరిఫికేషన్, దర్యాప్తు, భద్రత పేరుతో డబ్బులు బదిలీ చేయాలని ఎప్పుడూ కోరరని స్పష్టం చేశారు.

ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే భయపడకుండా, నిందితులు చెప్పినట్లు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలని సూచనలను నమ్మవద్దని తెలిపారు. వెంటనే 1930కు ఫోన్ చేసి లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సకాలంలో సమాచారం అందిస్తే నగదును నిలిపివేసి తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

#sidhumaroju

Alwal