● అర్హతలు లేకుండానే క్లినిక్‌ల నిర్వహణ
● ఐదుగురు నకిలీ వైద్యుల అరెస్ట్
● భారీగా అల్లోపతి మందులు, వైద్య పరికరాలు స్వాధీనం
అల్వాల్, సెప్టెంబరు 2: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నకిలీ వైద్యుల దందా గుట్టురట్టైంది. ఎలాంటి వైద్య విద్యార్హతలు, డిగ్రీలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తూ అల్లోపతి వైద్యం చేస్తున్న ఐదుగురిని కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పక్కా సమాచారంతో కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో తనిఖీలు, దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ పరిధిలో ఇద్దరు, జగద్గిరిగుట్ట, పేట్ బషీరాబాద్, సూరారం పరిధుల్లో ఒక్కొక్కరి చొప్పున మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుని రోగులను పరీక్షిస్తూ అల్లోపతి మందులు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి భారీగా మందులు, వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
వైద్య అర్హతలు, అవసరమైన అనుమతులు లేకుండా ప్రజలకు వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నకిలీ వైద్యులు, అనధికార క్లినిక్‌లపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.
#sidhumaroju
Alwal










