మదనపల్లి శశికళకు ఐదు పతకాలు.. రాష్ట్రస్థాయిలో సత్తా! |

0
3

మదనపల్లి శశికళకు ఐదు పతకాలు.. రాష్ట్రస్థాయిలో సత్తా!

మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన శక్తి టీమ్ సభ్యురాలు, కానిస్టేబుల్ శశికళ అసాధారణ ప్రతిభ కనబరిచారు. అమరావతి సమీపంలోని VIT-AP యూనివర్సిటీలో నిర్వహించిన 1st AP State Police Sports & Games Meet-2026లో కర్నూలు రేంజ్ తరఫున పోటీపడిన ఆమె ఏకంగా ఐదు పతకాలు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు.

వ్యక్తిగత విభాగాల్లో శశికళ అద్భుత ప్రతిభ చూపారు. హ్యాండ్ రెజ్లింగ్‌ (ఆర్మ్ రెజ్లింగ్)లో బలమైన ప్రత్యర్థులను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించారు. అనంతరం బాక్సింగ్ విభాగంలోనూ తన సత్తా చాటుతూ మరో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. మహిళా రెజ్లింగ్ విభాగంలో పోరాడి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకున్నారు.

వ్యక్తిగత విభాగాలతో పాటు జట్టు క్రీడల్లోనూ శశికళ కీలక పాత్ర పోషించారు. కర్నూలు రేంజ్ మహిళా బాస్కెట్‌బాల్ జట్టు రాష్ట్రస్థాయిలో రన్నరప్‌గా నిలవడంలో ఆమె తనవంతు సహకారం అందించారు. అలాగే మహిళా హ్యాండ్‌బాల్ జట్టు మూడో స్థానంలో నిలవడంలోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు.

మొత్తంగా రెండు స్వర్ణాలు, ఒక కాంస్యంతో పాటు జట్టు విభాగాల్లో మరో రెండు పతకాలు సాధించిన శశికళ ప్రతిభపై పోలీస్ శాఖతో పాటు మదనపల్లి ప్రాంత ప్రజలు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె విజయం ఇతర మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.