● రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌కు పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు
● శుభకార్యాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిపై నిఘా
● ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం
ఆల్వాల్, సెప్టెంబర్ 6: ఇళ్ల గృహప్రవేశాలు, పెళ్లిళ్లు తదితర శుభకార్యాల సందర్భంగా కొందరు ట్రాన్స్‌జెండర్లు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు.
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బలవంతపు వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రంలోని అన్ని నగరాల పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలోనూ ఇలాంటి వసూళ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి సమస్యను నియంత్రించిన విషయాన్ని డీజీపీ గుర్తుచేశారు.
ప్రస్తుతం కూడా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత పోలీసు విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
అయితే బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న కొందరి చర్యలను మొత్తం ట్రాన్స్‌జెండర్ సమాజానికి ఆపాదించకూడదని డీజీపీ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, వారు గౌరవప్రదమైన జీవనం సాగించేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.
ఇప్పటికే హైదరాబాద్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా, ప్రతిష్టాత్మకమైన హైడ్రా విభాగంలోనూ పలువురు ట్రాన్స్‌జెండర్లు విధులు నిర్వహిస్తూ ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా సమర్థంగా పనిచేస్తున్నారని డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు.
సమాజంలో గౌరవప్రదమైన జీవనానికి వారు అందిస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
#sidhumaroju
Alwal










