బిజినెస్ ఎక్స్‌పో-2026 రెండో రోజు సెషన్ ప్రారంభించిన గణబాబు
విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బిజినెస్ ఎక్స్‌పో–2026’ రెండో రోజు సెషన్ ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎక్స్‌పో ప్రాంగణంలోని వివిధ వాణిజ్య, పారిశ్రామిక స్టాళ్లను సందర్శించి ఉత్పత్తులు, వస్తువులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్, ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో విశాఖపట్నం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పోర్టులు, ఐటీ, పరిశ్రమలతో పాటు ఆధునిక ఏఐ డేటా సెంటర్ల కారణంగా విశాఖ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా మరింత అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
పెట్టుబడిదారులు, నవ పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం అనుకూల విధానాలతో పనిచేస్తోందని తెలిపారు. వ్యాపారాల స్థాపన ప్రక్రియను ప్రభుత్వం సరళీకృతం చేసిందన్నారు. యువత, మహిళలు స్వయం ఉపాధి, స్టార్టప్ రంగాల్లోకి అడుగుపెట్టి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
MSME పార్కుల ద్వారా యువతకు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఎదగాలని ఆకాంక్షించారు. ఎక్స్‌పో ద్వారా కొత్త ఆలోచనలు, వ్యాపార అవకాశాలు, మార్గదర్శకత్వం లభిస్తాయని పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు.










