భారత్ అవాజ్ న్యూస్ : శ్రీ సత్యసాయి జిల్లాలో నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు **‘ప్రాజెక్ట్ పునర్జీవనం’**ను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో ప్రాజెక్టుపై కలెక్టర్ సమగ్ర వివరాలు వెల్లడించారు.జిల్లాలో కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి, నేలలో తేమ తగ్గుదల, వ్యవసాయ వ్యర్థాల దహనం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రాజెక్టు లక్ష్యమన్నారు.
ఇటీవల 20 వేల సాయిల్ హెల్త్ శాంపిల్స్ పరిశీలించగా నేలలో సేంద్రీయ కార్బన్ శాతం 0.38 శాతం మాత్రమే నమోదైందని తెలిపారు.ఐదేళ్ల ప్రాజెక్టులో భాగంగా 5,000 ఎకరాల్లో నేల పునరుజ్జీవనం, సుమారు 4,000 టన్నుల CO₂e ఉద్గారాల నివారణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మల్బరీ వ్యర్థాలను వినియోగించి బయోచార్ తయారీ ద్వారా నేల సారాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచనున్నట్లు కలెక్టర్ వివరించారు.










