ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత, జ్ఞాన మహాయజ్ఞకేంద్రం వ్యవస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అనే గ్రంథం గణేశ నవరాత్రుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు సహా పలు ప్రధాన నగరాల్లో ఈ పుస్తకానికి భక్తుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
ఈ గ్రంథంలో శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పంతో పాటు ఆదిశంకరాచార్యులు, ప్రాచీన రుషులు రచించిన ముఖ్యమైన స్తోత్రాలు ఉన్నాయి. వీటికి పురాణపండ శ్రీనివాస్ అందించిన వ్యాఖ్యానం సరళమైన, సౌందర్యవంతమైన భాషలో ఉండటంతో పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటోందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అరుదైన గణపతి వర్ణ చిత్రాలు, ఆకర్షణీయమైన డిజైన్‌తో పుస్తకం ప్రత్యేకంగా నిలుస్తోంది. తెలంగాణ సచివాలయంలోని పలువురు అధికారులు సైతం పుస్తక రూపకల్పన, కంటెంట్‌ను మెచ్చుకుంటున్నారు.










