అంబేద్కర్ గౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదు ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ

0
0

• ఈ నెల 17న శాంతియుత ర్యాలీ

•ఆసిఫాబాద్ సీఐకి వినతిపత్రం అందజేత

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్  ప్రతినిధి: ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ సంఘం సభ్యులు తీవ్రంగా ఖండించారు. హమారా ప్రసాద్ అనే వ్యక్తి అంబేద్కర్ గారిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ రాసిన పుస్తకాన్ని, ఈ నెల 18న విడుదల చేయాలని నిర్ణయించడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. ఇటువంటి వ్యాఖ్యలు కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలాంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అంబేద్కర్ ఆలోచనలను, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని వారు స్పష్టం చేశారు. “అంబేద్కర్‌పై అవమానం అంటే రాజ్యాంగ విలువలపై దాడే” అని వారు పేర్కొన్నారు.

17న భారీ ర్యాలీ: ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు లుంబిని దీక్షా భూమి నుండి అంబేద్కర్ చౌక్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ ర్యాలీకి తగిన అనుమతులు ఇవ్వడంతో పాటు, శాంతియుత నిరసనకు అవసరమైన పూర్తి సహకారం అందించాలని కోరుతూ ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ సభ్యులు స్థానిక సీఐ గారికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సెంటర్ కమిటీ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

• అనుచిత వ్యాఖ్యలను ఖండిద్దాం…

• అంబేద్కర్ గౌరవాన్ని కాపాడుకుందాం…