● దేశంలోనే అత్యుత్తమ ANTFగా తెలంగాణ ఈగల్ ఫోర్స్
● కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అవార్డు
● యాంటీ నార్కోటిక్స్‌తో పాటు సైబర్ క్రైమ్‌లోనూ జాతీయ స్థాయిలో గుర్తింపు
● ఈగల్ ఫోర్స్‌కు డీజీపీ సీవీ ఆనంద్ అభినందనలు
అల్వాల్, సెప్టెంబర్ 22: మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్ సాధిస్తున్న ఫలితాలకు జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్ దేశంలోనే అత్యుత్తమ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ANTF)గా ఎంపికైంది. న్యూఢిల్లీలో జరుగుతున్న 3వ జాతీయ ANTF అధిపతుల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అవార్డు స్వీకరించారు.
ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ ఈగల్ ఫోర్స్‌కు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పనిచేస్తున్న ANTFలలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ అత్యుత్తమ గుర్తింపు పొందడం మొత్తం పోలీస్ శాఖకు గర్వకారణంగా అభివర్ణించారు. సందీప్ శాండిల్య సమర్థ నాయకత్వంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కృషిని అభినందించారు.
తెలంగాణ పోలీస్‌కు ఇది ఒక్క విభాగానికి పరిమితమైన విజయం కాదు. సైబర్ క్రైమ్, యాంటీ నార్కోటిక్స్ వంటి రెండు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాల్లో రాష్ట్ర పోలీస్ జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేరుకోవడం శాఖ పనితీరుకు దక్కిన గుర్తింపుగా నిలిచింది.
మిగిలిన విభాగాల్లోనూ పనితీరును మెరుగుపరిచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. జాతీయ క్రిమినల్ చట్టాల అమలు, ICJS, CCTNS వంటి రంగాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు, ప్రత్యేక దృష్టితో పనితీరును మరింత బలోపేతం చేసే కార్యాచరణ కొనసాగుతోంది. ఆయా విభాగాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ ముందుకు సాగుతోంది.
న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగుతున్న 3వ జాతీయ ANTF అధిపతుల సదస్సులో 2026–29 కాలానికి రూపొందించిన మాదకద్రవ్యాల నియంత్రణ విజన్ డాక్యుమెంట్ అమలు, నిర్దేశిత లక్ష్యాల సాధనపై చర్చ జరుగుతోంది. డ్రగ్‌ఫ్రీ ఇండియా దిశగా సమిష్టి కార్యాచరణను బలోపేతం చేయడం, సింథటిక్ డ్రగ్స్, క్లాండెస్టైన్ ల్యాబ్‌లను అరికట్టడం, డ్రగ్ కార్టెల్‌లను నిర్వీర్యం చేయడం, డార్క్‌నెట్, క్రిప్టోకరెన్సీ ఆధారిత డ్రగ్ నేరాల దర్యాప్తును బలోపేతం చేయడం వంటి అంశాలు సదస్సులో కీలకంగా ఉన్నాయి.
ఈగల్ ఫోర్స్‌కు దక్కిన జాతీయ అవార్డు తెలంగాణ పోలీస్‌కు మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపుగా నిలిచింది. డ్రగ్స్‌పై పోరాటంలో సాధించిన ఈ విజయంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ఈగల్ ఫోర్స్‌కు ప్రోత్సాహం లభించింది.
#Sidhumaroju
Alwal










