అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులతో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి భేటీ

0
0

హైదరాబాద్: కీలక ఖనిజాల అన్వేషణ, వెలికితీత, పరిశోధన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార భాగస్వామ్యాల రంగాల్లో అమెరికన్ సంస్థలతో కలిసి పనిచేసేందుకు సింగరేణి సంస్థ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు అమెరికన్ సంస్థలతో భాగస్వామ్య అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి వెల్లడించారు.

హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో అమెరికన్ కాన్సులేట్ పొలిటికల్, ఎకనామిక్ చీఫ్ మెరెడిత్ మెజ్లర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎండీతో సమావేశమైంది. ఈ సందర్భంగా కీలక ఖనిజ రంగంలో పరస్పర సహకారం, పెట్టుబడులు, పరిశోధనలపై విస్తృతంగా చర్చించారు.

రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌పై ప్రత్యేక దృష్టి

మైనింగ్ రంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన సింగరేణి ప్రస్తుతం కీలక ఖనిజాల రంగంలోకి విస్తరిస్తోందని సీఎండీ వివరించారు. కొత్తగూడెంలో ఇటీవల ఏర్పాటు చేసిన జియో సైన్స్ ల్యాబొరేటరీ, ఓపెన్‌కాస్ట్ గనుల ఓవర్‌బర్డెన్‌లో లభించే అరుదైన భూ మూలకాల (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) అన్వేషణపై అమెరికన్ ప్రతినిధి బృందం ప్రత్యేక ఆసక్తి కనబరిచింది.

విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కీలక ఖనిజ రంగంలో మరింత విస్తరించేందుకు సింగరేణి ప్రణాళికలు రూపొందిస్తోందని సీఎండీ తెలిపారు. విదేశీ పెట్టుబడులతో పాటు అంతర్జాతీయ సాంకేతిక, పరిశోధన సంస్థల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్‌లో అమెరికాలో నిర్వహించనున్న కీలక ఖనిజాల సదస్సుకు హాజరుకావాలని అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు సింగరేణిని ఆహ్వానించారు.

మూతపడిన గనులతో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లు మూతపడిన ఓపెన్‌కాస్ట్ గనులను ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా వినియోగించుకునే దిశగా సింగరేణి చర్యలు చేపడుతోంది. ఆయా ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను అధికారులు వివరించారు. డేటా సెంటర్లకు అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరాలో ఈ ప్లాంట్లు కీలకంగా మారనున్నాయని తెలిపారు.డేటా సెంటర్ల ఏర్పాటుపై అమెరికా సంస్థల ఆసక్తికృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డేటా సెంటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని అమెరికన్ ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణలో మరిన్ని డేటా సెంటర్ల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని, సింగరేణి ప్రాంతాల్లోనూ వీటి ఏర్పాటుపై ఆసక్తి ఉందని వెల్లడించారు.ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు, వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సాంప్రదాయ బొగ్గు గనుల సంస్థగా ఉన్న సింగరేణి, కీలక ఖనిజాలు, పునరుత్పాదక ఇంధనం, ఆధునిక సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాల దిశగా అడుగులు వేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.