ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాల రూపురేఖలను సమూలంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) విధానంలో రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 106 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 123 మున్సిపాలిటీల్లో ఏకకాలంలో పనులు మొదలు కానున్నాయి. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.7,469 కోట్లు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో ప్రత్యేకంగా రూ.3,890 కోట్ల విలువైన పనులను చేపట్టనున్నారు.
ఈ నిధులతో ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రోడ్ల నిర్మాణానికి రూ.4,656 కోట్లు, సెంట్రల్ మీడియన్ల ఏర్పాటుకు రూ.88 కోట్లు, కొత్త స్ట్రీట్ లైటింగ్ కోసం రూ.247 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.509 కోట్లు కేటాయించారు.










