● మొదటి అంతస్తు నుంచి పువ్వుల అలంకరణ భాగాలు కిందకు
● రాత్రివేళ ఘటన.. తప్పిన ప్రమాదం
● గతంలోనూ మక్కా మసీదు, భాగ్యలక్ష్మి ఆలయం వైపు పెచ్చులు
● మరమ్మతులు జరుగుతున్నా మళ్లీ అదే పరిస్థితి
● చారిత్రక కట్టడం పరిరక్షణపై పర్యాటకులు, స్థానికుల ఆగ్రహం
అల్వాల్, సెప్టెంబర్ 24: హైదరాబాద్ ఐకాన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చార్మినార్ నుంచి మరోసారి పెచ్చులు ఊడిపడ్డాయి. మొదటి అంతస్తులో మరమ్మతులు కొనసాగుతున్న ప్రాంతంలోని పువ్వుల ఆకృతులతో కూడిన అలంకరణ భాగాలు కిందకు ఊడిపడ్డాయి.
రాత్రి సమయంలో ఘటన చోటుచేసుకోవడంతో పర్యాటకుల రద్దీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
చార్మినార్ కేవలం హైదరాబాద్‌కు గుర్తింపు మాత్రమే కాదు.. దేశ చరిత్ర, వారసత్వానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక కట్టడం. నిత్యం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు చార్మినార్‌ను సందర్శిస్తుంటారు.
ఇలాంటి ప్రదేశంలో కట్టడం పైభాగం నుంచి పెచ్చులు ఊడిపడటం పర్యాటకుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా ఊడిపడిన భాగాలు కూడా మరమ్మతులు కొనసాగుతున్న ప్రాంతంలోనే ఉండటం మరింత చర్చకు దారితీసింది. మరమ్మతులు జరుగుతున్న సమయంలోనే అలంకరణ భాగాలు ఊడిపడితే.. చేపడుతున్న పరిరక్షణ పనుల పర్యవేక్షణ, నాణ్యతపై ప్రశ్నలు తలెత్తడం సహజమేనని పర్యాటకులు అంటున్నారు.
ఇది తొలిసారి కాదు. గతంలోనూ చార్మినార్‌లోని మక్కా మసీదు వైపు పెచ్చులు ఊడిపడ్డాయి. మరో సందర్భంలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వైపు కూడా పెచ్చులు కిందపడ్డాయి. ఇప్పుడు మరోసారి మొదటి అంతస్తు నుంచి భాగాలు ఊడిపడటంతో చార్మినార్ పరిరక్షణ చర్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పెచ్చులు ఊడిపడిన ప్రతిసారి వాటిని తొలగించడం, దెబ్బతిన్న ప్రాంతానికి మరమ్మతులు చేయడం మాత్రమే కాకుండా.. సమస్యకు కారణమవుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు.
వర్షాకాలంలో నీటి సీపేజీ, పాత నిర్మాణంలో ఏర్పడే పగుళ్లు, బయట అలంకరణ పొరల పరిస్థితిని క్రమం తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు.
ముఖ్యంగా పర్యాటకులు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో పైభాగాల నుంచి చిన్నపాటి నిర్మాణ భాగం కూడా కిందపడితే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. రాత్రివేళ పర్యాటకులు లేకపోవడంతో తాజా ఘటనలో ప్రమాదం తప్పినా.. ఇదే ఘటన పగటిపూట జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
చార్మినార్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా పురావస్తు శాఖ పరిరక్షణ పనులను మరింత పటిష్టంగా చేపట్టాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు. చారిత్రక కట్టడం అందాన్ని కాపాడటంతో పాటు.. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
#Sidhumaroju
Alwal










