ఏపీలో వాన బీభత్సం.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.

0
1

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ వర్షాలకు అతలాకుతలమైంది. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

 

ఈ క్రమంలో రాష్ట్రంలో వర్షపాత వివరాలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8:30 నుంచి గురువారం ఉదయం 7:00 గంటల మధ్య రాష్ట్రంలోని 80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విశాఖపట్నం రూరల్ పరిధిలోని తులసినగర్‌లో 236 మి.మీ. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మధురవాడలో 218 మి.మీ., ఎండాడలో 210 మి.మీ., సీతమ్మధారలో 205 మి.మీ. చొప్పున వర్షం కురియడంతో విశాఖ నగరం జలమయమైంది.