నందిగామలో 45 కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు

0
2

సెప్టెంబర్ 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ

 

నందిగామ సెప్టెంబర్ భారత్ ఆవాజ్ : ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్‌ స్కీం కింద నందిగామ పట్టణంలో 45 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు.

జీవో ఎంఎస్ నంబర్ 30 ప్రకారం 2019కు ముందు అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించుకుని, ఇంటి పన్ను రసీదులు కలిగి దరఖాస్తు చేసుకున్న వారిలో 45 మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. వీరికి సంబంధించిన భూమి మొత్తం 3,746.68 చదరపు గజాలు కాగా, ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.3.91 కోట్లుగా ఉందన్నారు.

అర్హులైన 45 మందిలో 6 మంది ఏపీఎల్, 39 మంది బీపీఎల్ కేటగిరీకి చెందినవారని, కులాల వారీగా ఓసీ 10, బీసీ 26, ఎస్సీ 5, ఎస్టీ 4 మంది ఉన్నారని తెలిపారు. 150 చదరపు గజాల లోపు నివేశన స్థలాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్, అంతకుమించి ఉన్న స్థలాలకు ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ ఉంటుందని పేర్కొన్నారు.

దరఖాస్తులకు డిసెంబర్ 31 వరకు అవకాశం

2019కు ముందు ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించుకుని, ఇంటి పన్ను రసీదులు కలిగి ఉన్నప్పటికీ ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులకు డిసెంబర్ 31, 2026 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.