మంచిర్యాలలో ఫెన్సింగ్ పోటీలకు ఘనంగా ప్రారంభించిన మేయర్ ధరణి మధుకర్

0
4

మంచిర్యాలలో ఫెన్సింగ్ పోటీలకు ఘనంగా శ్రీకారం

 

 అండర్‌-14, అండర్‌-17 బాలబాలికల పోటీల ప్రారంభం.. 200 మంది క్రీడాకారుల హాజరు

 

మంచిర్యాల: విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫెన్సింగ్ పోటీలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. శనివారం మంచిర్యాలలోని పీవీఆర్ గార్డెన్స్‌లో అండర్‌-14, అండర్‌-17 బాలబాలికల జోనల్ స్థాయి ఫెన్సింగ్ పోటీలను మేయర్ ధర్ని మధుకర్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎండీ యాకూబ్, ఎస్‌ఐ సంతోష్ ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు: మేయర్ ధర్ని మధుకర్

 

ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాల్లో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, క్రీడల ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేస్తూ, క్రీడల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

 

 పోటీల్లో పాల్గొన్న ప్రముఖులు

 

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు తాళ్ల సంపత్ రెడ్డి, పట్టి ప్రకృతి వెంకటేష్, కర్రు శ్రీనివాస్, అగ్గు సాగర్, రగ్బీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లింగంపల్లి శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్కాపురం సతీష్, అంగడి రాజేష్, భీమిని రాజేష్, మాజీ ఉపసర్పంచ్ మోతె కనకయ్య పాల్గొన్నారు.

 

పోటీల నిర్వాహకులు ఇదునూరి వెంకటేష్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవునూరి మహేష్, సీనియర్ క్రీడాకారులు ఆవునూరి సురేష్, కటకం కళ్యాణ్ కుమార్, పీడీలు సురేష్, మల్లిక, పలువురు పీఈటీలు, క్రీడాకారులు హాజరయ్యారు.