● ఘట్కేసర్ బస్టాండ్లో నీటి కొరతతో మరుగుదొడ్లు మూసివేత
● కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేక ప్రయాణికుల ఇబ్బందులు
● నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే బస్టాండ్లో దుస్థితి
అల్వాల్, నవంబర్ 10: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ బస్టాండ్లో నీటి కొరత కారణంగా మరుగుదొడ్లను మూసివేశారు. నీళ్లు అందుబాటులో లేవంటూ మరుగుదొడ్ల వద్ద “నీళ్లు లేవు.. రేపు రాగలరు” అనే బోర్డును ఏర్పాటు చేయడం ప్రయాణికులను విస్మయానికి గురిచేస్తోంది.
నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్టాండ్లో కనీస సౌకర్యమైన తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లకు నీళ్లు లేకపోవడంతో వాటిని వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది.
ప్రజా రవాణాలో కీలకమైన బస్టాండ్లో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.










