🛕గోవింద నామస్మరణతో మారుమోగిన పల్లగిరి కొండ
నందిగామ సెప్టెంబర్ 26: Bharath Aawaz :నందిగామ మండలం పల్లగిరి గట్టుపై కొలువై ఉన్న శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి గరుడోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పరాశరం పవన్‌కుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పుష్పాలంకరణలు, విశేష అర్చనలు నిర్వహించారు. వైఖానస సాంప్రదాయ పద్ధతిలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సుదర్శన హోమం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు.
నందిగామ పట్టణానికి చెందిన సముద్రాల సురేష్–లక్ష్మీకళ్యాణి దంపతుల కుటుంబ సభ్యుల సౌజన్యంతో శ్రీవారి దేవేరుల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించిన గరుడ వాహనంపై ఏర్పాటు చేశారు. గోవింద నామస్మరణల నడుమ గరుడ వాహనంపై స్వామివారి ఉత్సవం నిర్వహించడంతో పల్లగిరి కొండ భక్తి సంద్రంగా మారింది.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కొత్త హనుమేశ్వరరావు, సూరె రాంబాబు, దివ్వెల మురళి తదితరుల పర్యవేక్షణలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులకు స్వామివారి అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.▪️▪️▪️▪️▪️▪️










