కదిరి : నల్లచెరువు మండలం ఓరువాయి పంచాయతీ పరిధిలోని పల్లె వాండ్లపల్లి గ్రామంలో నెల రోజులుగా తాగునీటి సమస్య కొనసాగుతోంది. తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తాగునీటి అవసరాల కోసం గ్రామస్థులు రైతుల బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిందెలు, క్యాన్లతో దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నెల రోజులుగా సమస్య కొనసాగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గ్రామానికి తాగునీటి సరఫరాను పునరుద్ధరించడంతో పాటు, భవిష్యత్తులో సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.








