వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

0
4

భారత్ అవాజ్ న్యూస్ : కదిరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రెవెన్యూ సేవలను చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్‌. నరసింహులు డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మంగళవారం కదిరి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు చేపట్టిన దీక్షలకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ప్రభుత్వానికి సేవలందిస్తున్న వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. గ్రామస్థాయిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అనేక విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వీఆర్‌ఏలకు వారి సేవలకు తగిన గుర్తింపు, వేతనం, హక్కులు, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

వీఆర్‌ఏలకు పేస్కేల్‌ అమలు చేయాలని, అర్హత కలిగిన వారికి ఉద్యోగోన్నతులు కల్పించాలని, కారుణ్య నియామకాలను చేపట్టాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.

చర్చలు జరిపి పరిష్కారం చూపాలి

వీఆర్‌ఏలు గ్రామస్థాయిలో ప్రజలకు, రెవెన్యూ శాఖకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని నరసింహులు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు నుంచి గ్రామీణ ప్రజలకు అవసరమైన రెవెన్యూ సేవలను అందించడం వరకు వీఆర్‌ఏల పాత్ర కీలకమన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.

వీఆర్‌ఏల డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి, న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు వీఆర్‌ఏలు చేపట్టే ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటానికి సీఐటీయూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వీఆర్‌ఏల న్యాయమైన పోరాటానికి కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సాంబశివ, బాబ్జాన్‌, రామ్‌మోహన్‌, జగన్‌, వీఆర్‌ఏ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు రమణ, నాగభూషణ, చంద్ర, మహేష్‌, వీఆర్‌ఏలు కృష్ణమ్మ, దీప్తి, రెడ్డప్ప, వెంకటేష్‌, షాకీర్‌, శ్రీనివాసులు, షఫీ, సత్యనారాయణ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.