ప్రభుత్వ కార్యక్రమాల్లో క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, సభా మర్యాదను ప్రతి ఒక్కరూ పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మదనపల్లెలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగానికి కొందరు యువకులు అంతరాయం కలిగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుపై వేదిక నుంచే మండిపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో “గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్” శంకుస్థాపన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగులో ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సభకు హాజరైన వారిలో కొందరు యువకులు ఈలలు వేస్తూ, కేకలు పెడుతూ నినాదాలతో గందరగోళం సృష్టించారు. ఆమె ప్రసంగానికి పదేపదే అడ్డుతగలడంతో వేదికపై ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కలుగజేసుకున్నారు.
వెంటనే తన చైర్ నుంచి లేచి వెళ్లి మైక్ అందుకున్న చంద్రబాబు, యువకుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “కేంద్ర మంత్రి ప్రసంగిస్తున్నప్పుడు ఇలా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం సరికాదు. ఇది మంచి పద్ధతి కాదు. సభకు ఒక గౌరవం ఉంటుంది, దానిని కాపాడాలి” అంటూ గట్టిగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం అలుముకుంది.









