బాబాపూర్ గ్రామ పంచాయతీలో ఘనంగా స్వచ్ఛతే హి సేవ కార్యక్రమం

0
23

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):

ఆసిఫాబాద్ మండలం లోని బాబాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతే హి సేవ’ కార్యక్రమాన్ని అక్టోబర్ 1వ తేదీన అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శాత్రావేణి రాజన్న మరియు పంచాయతీ కార్యదర్శి దేవరాజ్ గారి నేతృత్వంలో పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ధ్యేయంగా ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు, మరియు ప్రభుత్వ కార్యాలయాల పరిసర ప్రాంతాలను గ్రామ సర్పంచ్ శాత్రావేణి రాజన్న, సెక్రటరీ దేవరాజ్ గారు స్వయంగా ఊడ్చి శుభ్రం చేశారు. వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా శ్రమదానం చేసి, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి రోడ్లను సుందరంగా తీర్చిదిద్దారు.

ఈ సందర్భంగా సర్పంచ్ శాత్రావేణి రాజన్న మరియు సెక్రటరీ దేవరాజ్ గారు మాట్లాడుతూ.. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా ఉంటాయని, తద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన మరియు రోగాల బారిన పడని వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, తడి చెత్త – పొడి చెత్తను వేరు చేసి నిర్దేశించిన ప్రాంతాల్లోనే వేయాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను ఒక బాధ్యతగా అలవాటు చేసుకున్నప్పుడే బాబాపూర్ గ్రామం ఆదర్శవంతంగా, ఆరోగ్యవంతంగా మారుతుందని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.