భారత్ అవాజ్ న్యూస్ : కదిరి బాలికల భద్రత, మాదక ద్రవ్యాల నివారణ, ర్యాగింగ్, సోషల్ మీడియా మోసాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ పవర్ (AISP) ఆధ్వర్యంలో కదిరి జడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. AISP రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కదిరి టౌన్ ఎస్‌ఐ ధనుంజయ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి చిన్నికృష్ణ, పాఠశాల హెచ్‌ఎం వెంకటచలం, ఇన్‌చార్జ్ నరసమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా టౌన్ ఎస్‌ఐ ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు తమ భద్రత విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్, వేధింపులు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దని, వ్యక్తిగత ఫొటోలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు వంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.మండల విద్యాశాఖ అధికారి చిన్నికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. చెడు స్నేహాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో స్వేచ్ఛగా పంచుకుని, అవసరమైన సమయంలో పెద్దల సహాయం తీసుకోవాలని సూచించారు.హెచ్‌ఎం వెంకటచలం మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వ్యక్తులతో పంచుకోవద్దని తెలిపారు.AISP రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, భద్రతపై అవగాహన పెంపొందించడమే AISP లక్ష్యమన్నారు. బాలికల భద్రత, యాంటీ డ్రగ్స్, ర్యాగింగ్ నిర్మూలన, సోషల్ మీడియా మోసాలపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.కార్యక్రమంలో AISP కదిరి నియోజకవర్గ కార్యదర్శి అభి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.










