ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే బీసీ నాయకులు పాలసీ మేకర్లుగా ఎదగాలని, అందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఓబీసీ జ్యోతిరావు ఫూలే జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు అన్నారు.
రాష్ట్రంలో బీసీ జనాభా 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో వారికి తగిన ప్రాతినిధ్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీ స్థానాల్లో 50 శాతం బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.చట్టపరంగా రిజర్వేషన్లు చెల్లవని తెలిసి కూడా బీసీలకు రిజర్వేషన్ల పేరుతో ప్రధాన రాజకీయ పార్టీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీల ఓట్ల కోసం రాజకీయ నాటకాలు ఆడటం సరికాదన్నారు.బీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే వారిని పాలసీ మేకర్లుగా, రాజ్యాధికారంలో భాగస్వాములుగా చేయాలనుకుంటే ఎమ్మెల్యే సీట్లలో 50 శాతం కేటాయించాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయ పక్షాలు రెండు కుటుంబాలకు చెందిన వారేనని, వారికి ఇష్టం వచ్చినట్టుగా సీట్లు ఇచ్చుకునే అవకాశం ఉందని, బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే బీసీలకు ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో 50 శాతం కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పోతల ప్రసాద్ నాయుడు డిమాండ్ చేశారు. జ్యోతిరావు ఫూలే ఆశయం కేవలం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకే పరిమితం కాదని, అధికారంలో వాటా దక్కినప్పుడే బీసీల బతుకులు మారుతాయని ఆయన అన్నారు.










