అమరావతి ఓఆర్‌ఆర్‌కు టెండర్లు.. రూ.11,537 కోట్లతో పనులు.

0
1

నాలుగు ప్యాకేజీలుగా 195 కి.మీ. రోడ్డు నిర్మాణం

సివిల్ పనుల అంచనా వ్యయం రూ.11,537 కోట్లు

హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో మూడేళ్లలో పూర్తిచేయాలన్న లక్ష్యం

ఐదు జిల్లాల మీదుగా వెళ్లనున్న ఔటర్ రింగ్ రోడ్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ నిర్మించ తలపెట్టిన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ భారీ ప్రాజెక్టు పనుల కోసం నాలుగు ప్యాకేజీలుగా టెండర్లను ఆహ్వానించింది. మొత్తం రూ.11,537.70 కోట్ల అంచనా వ్యయంతో సివిల్ పనులను చేపట్టనున్నారు.

 

శుక్రవారం నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 195.13 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని నిర్మించనున్నారు. ఇందులో 189.93 కి.మీ. ఆరు వరుసల ఓఆర్‌ఆర్‌ కాగా, నారాకోడూరు నుంచి బుడంపాడు వరకు 5.2 కి.మీ. నాలుగు వరుసల అనుసంధాన రహదారి కూడా ఉంది. నవంబర్ 18 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించగా, 19న టెక్నికల్ బిడ్లను తెరవనున్నారు. కేంద్ర కమిటీల నుంచి తుది అనుమతులు త్వరలో రానున్నాయన్న అంచనాతో ఎన్‌హెచ్‌ఏఐ ముందుగానే టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టింది.