ఏపీకి 23 ఐఐటీల టెక్నాలజీ.. చంద్రబాబు సమక్షంలో చారిత్రక డిక్లరేషన్! అమరావతి కేంద్రంగా కీలక ముందడుగు.

0
1

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, సాంకేతిక ప్రగతికి ఊతమిచ్చేలా దేశంలోని 23 ఐఐటీలు ముందుకొచ్చాయి. రాష్ట్రానికి అవసరమైన టెక్నాలజీని బదిలీ చేసేందుకు సంపూర్ణ అంగీకారం తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ‘పాన్ ఐఐటీ ఏపీ 2026’ సదస్సులో ఒక చారిత్రక డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. అమరావతిని గ్లోబల్ నాలెడ్జ్, డీప్‌టెక్ హబ్‌గా మార్చే లక్ష్యంతో విజయవాడలో జరిగిన ఈ సదస్సులో తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు మైలురాయిగా నిలవనుంది.

 

శనివారం విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన ఈ సదస్సు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. అమరావతిలో ‘పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్’ ఏర్పాటు చేస్తున్నట్లు, డీప్‌టెక్ స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా రూ.500 కోట్లతో ‘పాన్ ఐఐటీ అమరావతి వెంచర్ ఫండ్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మంది ఐఐటీయన్లతో ఒక గ్లోబల్ మెంటర్ల నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసి ఏపీలోని స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.