పుట్టినరోజు వేడుకల్లో.. మృత్యుఘోష.|

0
6

● కూతురి బర్త్‌డే కోసం ట్యాంక్‌బండ్‌కు వచ్చిన కుటుంబం

● రోడ్డు దాటుతుండగా లారీ ఢీ.. ఆరేళ్ల చిన్నారి మృతి

● చికిత్స పొందుతూ బంధువు మృతి.. జొన్నబండలో కన్నీరుమున్నీరు.

అల్వాల్, అక్టోబరు 5: కూతురి పుట్టినరోజును ఆనందంగా జరుపుకోవాలనుకున్న కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది.

ట్యాంక్‌బండ్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఆరేళ్ల చిన్నారి సరాక్షి, ఆమె బంధువు విశ్వనాథ్ అలియాస్ విశ్వంత్ (41) మృతి చెందారు. 

ఈ ఘటనతో ఓల్డ్ అల్వాల్ జొన్నబండలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జొన్నబండకు చెందిన మీ-సేవా కేంద్రం నిర్వాహకుడు సాయినాథ్ కుమార్తె సరాక్షి పుట్టినరోజు సందర్భంగా శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులతో కలిసి కూకట్‌పల్లిలోని పీవీఆర్‌లో సెకండ్‌ షో సినిమా చూశారు.

అనంతరం ఆదివారం తెల్లవారుజామున సుమారు 2.15 గంటలకు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు.

కారును రోడ్డుపక్కన నిలిపిన అనంతరం కేక్‌ కట్‌ చేసేందుకు హుస్సేన్‌సాగర్ వైపు వెళ్లాలని కుటుంబ సభ్యులు రోడ్డు దాటుతున్నారు. ఈ సమయంలో విశ్వంత్ చిన్నారి సరాక్షిని చేతుల్లో ఎత్తుకుని ముందుకు వెళ్తుండగా సికింద్రాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సరాక్షిని 108 సిబ్బంది కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వంత్ కూడా ప్రాణాలు కోల్పోయారు

ప్రమాదంపై దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ ఫారూఖ్‌తో పాటు హెల్పర్ సైయీద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పుట్టినరోజు వేడుకల కోసం బయలుదేరిన కుటుంబానికి.. కేక్‌ కట్‌ చేయకముందే చిన్నారి దూరమవడం, ఆమెతోపాటు బంధువు కూడా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.

#Sidhumaroju

Alwal