హెచ్‌ఐవీ నియంత్రణలో మంచిర్యాల జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు

0
4

మంచిర్యాల జిల్లా: జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన హెచ్‌ఐవీ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా 95:95:95 లక్ష్యాలను విజయవంతంగా సాధించి మంచిర్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 20 సురక్షిత జిల్లాల జాబితాలో స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అధికారుల బృందం ఘనంగా సన్మానించింది. కలెక్టర్‌కు శాలువా కప్పి జ్ఞాపికను అందజేసింది.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చూపిన అంకితభావం, జిల్లా కలెక్టర్ సమర్థవంతమైన నాయకత్వం, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, అందించిన సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.వైద్య ఆరోగ్య శాఖ, దిశ బృందం, వివిధ స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో జిల్లాలో హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు, చికిత్స సేవలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయడం ద్వారా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోగలిగామని వెల్లడించారు.హెచ్‌ఐవీ నియంత్రణ, నివారణతో పాటు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఇదొక కీలక విజయమని అధికారులు పేర్కొన్నారు.