● హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టోలిచౌకీ స్టేషన్లో ఘటన
● రూ.40 వేల డిమాండ్‌లో మిగిలిన రూ.20 వేలు తీసుకుంటుండగా పట్టుబాటు
● మరో నాలుగు కవర్లలో రూ.1.80 లక్షల లెక్కల్లో చూపని నగదు గుర్తింపు
అల్వాల్, నవంబర్19:హోటల్‌కు ప్రత్యేక వెసులుబాటు కల్పించేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏసీబీ వలకు చిక్కారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోల్కొండ జోన్ టోలిచౌకీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎల్. రమేష్ నాయక్ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా సిటీ రేంజ్-1 ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా ఉండటంతో పాటు, అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత మరో గంటపాటు కేఫ్టేరియా నిర్వహించుకునేందుకు, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లను పూర్తి చేసుకునేందుకు అనుమతి కల్పించే విషయంలో నెలవారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
ఈ వ్యవహారంలో అక్టోబర్ 31, 2026న నెలకు రూ.50 వేల చొప్పున డిమాండ్ చేయగా, తొలి నెలకు రూ.10 వేలు తగ్గించి రూ.40 వేలకు ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. ఇప్పటికే రూ.20 వేలు తీసుకున్న ఇన్స్పెక్టర్, మిగిలిన మొత్తాన్ని స్వీకరిస్తుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
●లంచం సొమ్ముతో పాటు రూ.1.80 లక్షలు
ట్రాప్ సమయంలో రూ.20 వేలతో పాటు నాలుగు వేర్వేరు కవర్లలో ఉన్న మరో రూ.1.80 లక్షల లెక్కల్లో చూపని నగదును గుర్తించారు. అధికార పదవిని దుర్వినియోగం చేస్తూ ప్రజా విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అక్రమ ప్రయోజనం పొందినట్లు ఇన్స్పెక్టర్పై ఆరోపణలు ఉన్నాయి.
అనంతరం రమేష్ నాయక్‌ను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచారు.
●లంచం అడిగితే 1064కు ఫిర్యాదు
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని, వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
#Sidhumaroju
Alwal










