పుట్టినరోజు వేడుకల్లో.. మృత్యుఘోష.|

0
3

● కూతురి బర్త్‌డే కోసం కుటుంబంతో ట్యాంక్‌బండ్‌కు వచ్చిన తల్లిదండ్రులు

● కేక్‌ కట్‌ చేసేందుకు రోడ్డు దాటుతుండగా లారీ ఢీ

● ఆరేళ్ల చిన్నారితో పాటు బంధువు మృతి.. జొన్నబండలో కన్నీరుమున్నీరు

అల్వాల్, అక్టోబరు 5: కూతురి పుట్టినరోజును ఆనందంగా జరుపుకోవాలనుకున్న కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది.

ట్యాంక్‌బండ్‌పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఆరేళ్ల చిన్నారి సరాక్షి, ఆమె బంధువు విశ్వనాథ్ అలియాస్ విశ్వంత్ (41) మృతి చెందారు. 

ఈ ఘటనతో ఓల్డ్ అల్వాల్ జొన్నబండలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

జొన్నబండకు చెందిన మీ-సేవా కేంద్రం నిర్వాహకుడు సాయినాథ్, ఆయన భార్య అశ్వినికి ఇద్దరు కుమార్తెలు శరణ్య (9), సరాక్షి (6) ఉన్నారు.

సరాక్షి పుట్టినరోజు సందర్భంగా శనివారం రాత్రి సాయినాథ్, అశ్వినితో పాటు ఇద్దరు కుమార్తెలు, దగ్గరి బంధువు విశ్వనాథ్ అలియాస్ విశ్వంత్, ఆయన భార్య సింధు కలిసి కూకట్‌పల్లిలోని పీవీఆర్‌లో సెకండ్‌ షో సినిమా చూశారు.

సినిమా అనంతరం ఆదివారం తెల్లవారుజామున సుమారు 2.15 గంటలకు ట్యాంక్‌బండ్‌లోని మగ్దూం మోయినుద్దీన్ విగ్రహం సమీపానికి చేరుకున్నారు. అక్కడ కారును రోడ్డుపక్కన నిలిపి, సరాక్షి పుట్టినరోజు కేక్‌ కట్‌ చేసేందుకు హుస్సేన్‌సాగర్ వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నారు.

ఈ సమయంలో విశ్వంత్ చిన్నారి సరాక్షిని ఎత్తుకుని ముందుకు వెళ్తుండగా, సికింద్రాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. 

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సరాక్షిని 108 వాహనంలో కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలైన విశ్వంత్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

విశ్వంత్‌కు సింధుతో మూడు నెలల క్రితమే వివాహమైనట్లు పోలీసులు తెలిపారు.

సాయినాథ్ నిర్వహిస్తున్న మీ-సేవా కేంద్రంలో విశ్వంత్, సింధు కూడా పనిచేస్తున్నారు.

ప్రమాదంపై సాయినాథ్ ఫిర్యాదు మేరకు దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్ ఫారూఖ్, హెల్పర్ సైయీద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కూతురి పుట్టినరోజు కోసం కుటుంబమంతా కలిసి బయలుదేరిన వేళ.. తల్లి అశ్విని ముందే ఆరేళ్ల సరాక్షి దూరమవడం, అదే ప్రమాదంలో కుటుంబానికి దగ్గరి బంధువు విశ్వంత్ కూడా మృతి చెందడంతో జొన్నబండలో విషాదం నెలకొంది.

#sidhumaroju

Alwal