రోలుగుంట: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ మెమోరియల్ అవార్డు – అంతర్జాతీయ స్థాయి వర్చువల్ అవార్డు ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థులలో సృజనాత్మకత, ఆలోచనా నైపుణ్యాలను పెంపొందిస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించారు.ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పి.వి.ఎం. నాగజ్యోతి ఎంపికయ్యారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమెకు అవార్డును ప్రదానం చేశారు.ఉపాధ్యాయ వృత్తిని కేవలం బోధనకే పరిమితం చేయకుండా విద్యార్థులలోని అంతర్గత ప్రతిభను వెలికితీయడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, విద్యను ఆచరణాత్మకంగా అందించే ఉపాధ్యాయులను ప్రోత్సహించడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.విద్యార్థి కేంద్రిత బోధన, వినూత్న విద్యా కార్యక్రమాలు, ఆంగ్ల భాషా బోధనలో కొత్త పద్ధతులు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో నాగజ్యోతి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని నిర్వాహకులు అభినందించారు.ఇటీవల ఫిన్లాండ్ విద్యా విధానంపై అధ్యయనం చేసే అవకాశం పొందిన నాగజ్యోతి అక్కడి విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు, ఉపాధ్యాయ శిక్షణ వంటి అంశాలను పరిశీలించి వాటిలోని మంచి విధానాలను మన విద్యా వ్యవస్థలో అన్వయించేందుకు కృషి చేస్తున్నారు.ఈ పురస్కారం అందుకోవడం పట్ల నాగజ్యోతి హర్షం వ్యక్తం చేశారు. తన సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించిన అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.ఒక ఉపాధ్యాయుడికి లభించే ప్రతి గుర్తింపు వ్యక్తిగత విజయమే కాకుండా విద్యార్థులు, పాఠశాల, సహచర ఉపాధ్యాయులకు లభించిన గౌరవంగా భావిస్తానని, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.










