రెంటికోటలో కూటమి అభ్యర్థి భాగ్యవతికి మద్దతుగా ఎమ్మెల్యే శిరీష ప్రచారం

గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: గౌతు శిరీష
పలాస: పలాస మండలం రెంటికోట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి హోరియా భాగ్యవతికి మద్దతుగా పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని కంట్రగడ, రెంటికోట కాలనీ, రెంటికోట గ్రామాల్లో పర్యటించి, గ్రామస్తులను నేరుగా కలిసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ప్రజలతో మమేకమై వారి సమస్యలు, గ్రామ అభివృద్ధికి అవసరమైన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, స్థానిక సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు.
సర్పంచ్ అభ్యర్థి హోరియా భాగ్యవతితో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులకు కూడా ఓట్లు వేసి ఘన విజయం అందించాలని గ్రామస్తులను ఆమె కోరారు. కూటమి అభ్యర్థులు గెలిస్తే మరింత బాధ్యతతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, రెంటికోట పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పారు.
ప్రచార కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.










