శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా వరుణ యాగం – పాల్గొన్న ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గణబాబు గార్లు

0
1

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం (జంక్ ఏరియా)లో ఈరోజు మంగళవారం (06-10-2026) వరుణ యాగం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ శ్రీ ఎం. శ్రీభరత్ మరియు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

 ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఎంపీ, ఎమ్మెల్యే గార్లకు ఆలయ ధర్మకర్తలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన వరుణ యాగం ప్రత్యేక పూజల్లో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు.

 ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గణబాబు గార్లు మాట్లాడుతూ.. ఎల్-నినో (El Niño) ప్రభావం కారణంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతాంగం, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రకృతి కరుణించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో ఈ వరుణ యాగాన్ని నిర్వహించడం ఎంతో శుభపరిణామమని కొనియాడారు. సకాలంలో వానలు పడి జలాశయాలు నిండి, అన్నదాతలు పాడిపంటలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలందరిపై ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, స్థానిక ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.