రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య కీలక సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. అనంతరం ముగ్గురు నేతలు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కూటమి పక్షాలు కలిసికట్టుగా పనిచేయాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. శాతం లెక్కలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో ఏ పార్టీకి బలం ఉంటే వారికే సీట్లు కేటాయించాలనే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీకి ఒక్క స్థానం కూడా దక్కకుండా చేయాలనే పట్టుదలతో కూటమి నేతలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.










