Madanapalle: మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన కోట్ల విలువైన ప్రభుత్వ భూమితో పాటు హంద్రీ-నీవా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రభుత్వ భూములను అక్రమ ఆక్రమణలు, అనధికార నిర్మాణాల నుంచి కాపాడాలని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షులు జి. పునీత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మదనపల్లె తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. కోర్టు ఆదేశాలు, స్టే ఉన్నప్పటికీ రాత్రి వేళలు, సెలవు రోజులను ఆసరాగా చేసుకుని నిర్మాణాలు కొనసాగుతున్నట్లు సమాచారం వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రీయ విద్యాలయ స్థలంతో పాటు హంద్రీ-నీవా ప్రభుత్వ భూమిలో బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు ప్లాట్లు కేటాయిస్తున్నట్లు ప్రచారం చేస్తూ నిర్మాణాలు చేపడుతున్న అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.










