ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న భీమ్ సొసైటీ శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ధర్నాకు దిగారు. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న సమస్యలపై మంగళవారం వారు కళాశాల ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం తమకు బేసిక్ వేతనాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్, బకాయిలను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికి అధికారిక ఆర్డర్ కాపీలను అందజేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తాము రోజుకు ఎక్కువ గంటలు శ్రమిస్తున్నప్పటికీ, దానికి తగినట్లుగా కాకుండా చాలా తక్కువ వేతనాలు ఇస్తూ శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని సిబ్బంది ఆరోపించారు. తమ హక్కుల సాధన కోసమే ఈ ధర్నా చేపట్టినట్లు స్పష్టం చేశారు. తమ సమస్యలపై అధికారులు స్పందించి తగిన న్యాయం చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.










