● బీఐఎస్ పర్యవేక్షణ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపిన ఆడిట్
● ఐదేళ్లలో 2,450 ఫిర్యాదులు.. 1,515 పరిష్కారంలో జాప్యం
● దుకాణాలు, హాల్‌మార్కింగ్ కేంద్రాల తనిఖీల్లోనూ నిర్లక్ష్యం
● కొనుగోలుకు ముందే హెచ్‌యూఐడీ కోడ్ తనిఖీ చేసుకోవాలని నిపుణుల సూచన
● బీఐఎస్ గుర్తింపు పొందిన నమ్మకమైన దుకాణాలనే ఎంచుకోవాలి
అల్వాల్, నవంబర్ 22: బంగారం కొనుగోలు చేసే వినియోగదారులకు దాని స్వచ్ఛతపై భరోసా కల్పించాల్సిన హాల్‌మార్కింగ్ వ్యవస్థ పర్యవేక్షణలోనే లోపాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. బంగారు ఆభరణాల నాణ్యతను నిర్ధారించే భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) పనితీరుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) ఆడిట్ పలు ప్రశ్నలు లేవనెత్తింది. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం, ఆభరణాల దుకాణాలు, హాల్‌మార్కింగ్ కేంద్రాల తనిఖీల్లో లోపాలు, నకిలీ హాల్‌మార్క్‌లపై చర్యల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వంటి అంశాలను ఆడిట్ ఎత్తిచూపినట్లు వెల్లడైంది. దీంతో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ గుర్తులతో పాటు హెచ్‌యూఐడీ కోడ్‌ను స్వయంగా తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
● ఫిర్యాదుల పరిష్కారంలో తీవ్ర జాప్యం
బీఐఎస్‌కు గత ఐదేళ్లలో వినియోగదారుల నుంచి మొత్తం 2,450 ఫిర్యాదులు అందగా, వాటిలో 1,515 ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించలేదని ఆడిట్ గుర్తించినట్లు నివేదిక వెల్లడించింది. అంటే సుమారు 62 శాతం ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. సంస్థ నిబంధనల ప్రకారం సాధారణ ఫిర్యాదులను 90 రోజుల్లో, పరీక్షలు నిర్వహించాల్సిన ఫిర్యాదులను 120 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. వినియోగదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించాల్సిన సంస్థలోనే ఇంతటి జాప్యం చోటుచేసుకోవడం గమనార్హం.
● దుకాణాల తనిఖీల్లోనూ వెనుకంజ
బంగారు ఆభరణాల విక్రయాలకు సంబంధించి బీఐఎస్ వద్ద నమోదైన దుకాణాలను తనిఖీ చేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగలేదని ఆడిట్ పేర్కొన్నట్లు కథనాలు వెల్లడించాయి. 2024-25 సంవత్సరంలో 28,865 నమోదిత దుకాణాల్లో కేవలం 5,444 దుకాణాలనే తనిఖీ చేశారు. అంటే సుమారు 81 శాతం దుకాణాలు తనిఖీలకు నోచుకోలేదు. హాల్‌మార్కింగ్ నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్నది నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, తనిఖీల్లో ఈ స్థాయి లోటు ఉండటం వ్యవస్థ పనితీరుపై సందేహాలు కలిగిస్తోంది.
● హాల్‌మార్కింగ్ కేంద్రాల పర్యవేక్షణలోనూ లోపాలు
బంగారు ఆభరణాల స్వచ్ఛతను పరీక్షించి హాల్‌మార్క్ చేసే అసేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ కేంద్రాల (ఏహెచ్‌సీ) తనిఖీల్లోనూ వెనుకబాటు కనిపించింది. నాలుగు బీఐఎస్ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో 5,020 సర్వైలెన్స్ ఆడిట్‌లు నిర్వహించాల్సి ఉండగా, 2,826 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 2,194 తనిఖీలు జరగలేదు. నిర్దేశించిన తనిఖీల్లో 43.7 శాతం మేర లోటు ఉన్నట్లు ఆడిట్ గుర్తించినట్లు సమాచారం. హాల్‌మార్కింగ్ కేంద్రాల పనితీరుపై తగిన పర్యవేక్షణ లేకపోతే నాణ్యతా ప్రమాణాల అమలుపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
● నకిలీ హాల్‌మార్క్‌లపై చర్యలేవీ?
నకిలీ హాల్‌మార్క్‌ల వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా ఆభరణాల విక్రయాలు, నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బీఐఎస్‌పై ఉంది. అయితే దాడులు, గుర్తించిన ఉల్లంఘనలు, స్వాధీనం చేసుకున్న వస్తువులు, జరిమానాలు, కేసుల నమోదు, న్యాయపరమైన చర్యలకు సంబంధించిన వివరాల నిర్వహణలోనూ లోపాలు ఉన్నట్లు ఆడిట్ ప్రస్తావించినట్లు కథనాలు వెల్లడించాయి. కొన్ని కేసుల విచారణలో జాప్యం, న్యాయపరమైన వ్యవహారాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లకపోవడం కూడా ఆడిట్ పరిశీలనలోకి వచ్చినట్లు సమాచారం.
సిబ్బంది కొరత, మారుమూల ప్రాంతాల నుంచి ఆభరణాల నమూనాల సేకరణలో ఇబ్బందుల కారణంగా తనిఖీలు, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని బీఐఎస్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. లోపాలను సరిదిద్దేందుకు చర్యలు ప్రారంభించినట్లు కూడా సంస్థ తెలిపింది. ఈ ఆడిట్ నివేదిక ముసాయిదా దశలో ఉండగా, 2026 జూలైలో కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
● హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి?
బంగారు ఆభరణాల్లో స్వచ్ఛమైన బంగారం ఎంత శాతం ఉందో నిర్ధారించి ధ్రువీకరించే విధానమే హాల్‌మార్కింగ్. దేశంలో ఈ వ్యవస్థను బీఐఎస్ అమలు చేస్తోంది. 2021 జూన్ 23 నుంచి దశలవారీగా తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. బంగారం స్వచ్ఛతను క్యారెట్లతో పాటు ఫైనెస్ సంఖ్యతో సూచిస్తారు. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారంపై 22K916 గుర్తు ఉంటుంది. అంటే ప్రతి వెయ్యి భాగాల్లో 916 భాగాలు స్వచ్ఛమైన బంగారం ఉన్నట్లు అర్థం. ప్రస్తుతం 9, 14, 18, 20, 22, 23, 24 క్యారెట్లకు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం హాల్‌మార్కింగ్ సదుపాయం ఉంది.
● హెచ్‌యూఐడీ.. ఆభరణానికి ప్రత్యేక గుర్తింపు
హాల్‌మార్కింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు హెచ్‌యూఐడీ (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్) విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి హాల్‌మార్క్ చేసిన ఆభరణానికి ఆరు అక్షరాలు, అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు కోడ్ కేటాయిస్తారు. ఈ కోడ్ ద్వారా ఆభరణం స్వచ్ఛత, రకం, దుకాణం, హాల్‌మార్కింగ్ కేంద్రానికి సంబంధించిన వివరాలను గుర్తించవచ్చు. ఒకే కోడ్‌ను మరో ఆభరణానికి ఉపయోగించకుండా ప్రత్యేక గుర్తింపుతో ఈ విధానం పనిచేస్తుంది. తద్వారా నకిలీ హాల్‌మార్క్‌లను గుర్తించడంతో పాటు ఆభరణాల వివరాలను పరిశీలించడం సులభమవుతుంది.
● కొనుగోలుకు ముందే కోడ్ తనిఖీ చేసుకోండి
బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో దుకాణదారుడు ఇచ్చే వివరాలపైనే ఆధారపడకుండా వినియోగదారులు స్వయంగా హెచ్‌యూఐడీ కోడ్‌ను తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం బీఐఎస్ కేర్ (BIS CARE) మొబైల్ యాప్‌లోని ‘Verify HUID’ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆభరణంపై ఉన్న ఆరు అక్షరాలు, అంకెల కోడ్‌ను యాప్‌లో నమోదు చేస్తే దానికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. యాప్‌లో కనిపించే ఆభరణం రకం, స్వచ్ఛత, దుకాణం, హాల్‌మార్కింగ్ కేంద్రం వివరాలను పరిశీలించాలి. అందుబాటులో ఉన్న ఫొటోలు, బరువు వివరాలను చేతిలోని ఆభరణంతో సరిపోల్చుకోవాలి. వివరాల్లో తేడాలుంటే అప్రమత్తమై బీఐఎస్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.
● బిల్లుతో పాటు స్వచ్ఛత వివరాలూ ముఖ్యం
బంగారం కొనుగోలు చేసేటప్పుడు బీఐఎస్ గుర్తింపు పొందిన, విశ్వసనీయమైన దుకాణాలనే ఎంచుకోవాలి. ఆభరణంపై బీఐఎస్ లోగో, స్వచ్ఛత సూచిక, హెచ్‌యూఐడీ కోడ్ ఉన్నాయో లేదో పరిశీలించాలి. కొనుగోలు చేసిన ప్రతి ఆభరణానికి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. అందులో ఆభరణం బరువు, స్వచ్ఛత, ధర, ఇతర ఛార్జీల వివరాలు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. హాల్‌మార్క్ లేని లేదా నకిలీ హాల్‌మార్క్‌తో ఆభరణాలు విక్రయిస్తే బీఐఎస్ చట్టం-2016 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వినియోగదారులు బీఐఎస్ కేర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
● విస్తరిస్తున్న హాల్‌మార్కింగ్.. పెరగాల్సిన పర్యవేక్షణ
కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం 2026 అక్టోబర్ 15 నాటికి దేశంలో 65 కోట్లకు పైగా బంగారు ఆభరణాలకు హెచ్‌యూఐడీ కోడ్‌లు కేటాయించారు. బీఐఎస్ వద్ద నమోదైన క్రియాశీల ఆభరణాల దుకాణాల సంఖ్య 43,153 నుంచి 2,36,624కు పెరగగా, గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ కేంద్రాల సంఖ్య 948 నుంచి 1,565కు చేరింది. మరోవైపు వెండి హాల్‌మార్కింగ్ స్వచ్ఛంద విధానంలో కొనసాగుతున్నప్పటికీ, హాల్‌మార్క్ చేసిన వెండి వస్తువులకు 2025 సెప్టెంబర్ 1 నుంచి హెచ్‌యూఐడీ తప్పనిసరి చేశారు.
హాల్‌మార్కింగ్ వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ దాని పర్యవేక్షణ కూడా అదే స్థాయిలో బలోపేతం కావాలి. బంగారం కొనుగోలుదారులకు స్వచ్ఛతపై భరోసా కల్పించాల్సిన బాధ్యత బీఐఎస్‌పై ఉంది. తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించడం, ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించడం, నకిలీ హాల్‌మార్క్‌లపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంచాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వినియోగదారులు కూడా బంగారం కొనుగోలులో అప్రమత్తంగా వ్యవహరించి హెచ్‌యూఐడీ కోడ్‌ను సరిచూసుకోవాలి. ఎందుకంటే బంగారం విలువ దాని ధరలోనే కాదు.. దాని స్వచ్ఛతపై ఉండే నమ్మకంలోనూ ఉంటుంది.
#Sidhumaroju
Alwal









